తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కరోనా కలకలం రేపింది. బీఆర్కే భవనంలో పనిచేస్తున్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కరోనా బారిన పడ్డారు. ఆయనతో సన్నితంగా ఉన్న, వైరస్ లక్షణాలు ఉన్న ఉద్యోగులు కరోనా పరీక్షలు చేయించుకోగా.. మరో నలుగురికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఉద్యోగుల్లో కరోనా కలవరం మొదలైంది. పని చేస్తున్న గదులు ఇరుకుగా ఉండడంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఉద్యోగులు అంటున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం వెల్లడించిన బులిటెన్ ప్రకారం 64,474 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 2,295 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1452 కేసులు నమోదు అయినట్లు తెలిపింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 278 మంది కోలుకున్నారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,89,751కి చేరింది. మరణాల సంఖ్య 4,039 పెరుగగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 9,861 యాక్టివ్ కేసులున్నాయి.