Telangana Polls: నేడే కౌంటింగ్.. ఓట్ల లెక్కింపు ఇలా
తెలంగాణ శాసన సభ ఫలితాల ఉత్కంఠ ఇవాళ వీడనుంది. రాష్ట్రంలోని 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించనున్నారు.
By అంజి Published on 3 Dec 2023 1:20 AM GMTTelangana Polls: నేడే కౌంటింగ్.. ఓట్ల లెక్కింపు ఇలా
తెలంగాణ శాసన సభ ఫలితాల ఉత్కంఠ ఇవాళ వీడనుంది. రాష్ట్రంలోని 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించి, 30 నిమిషాల తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. జూబ్లీహిల్స్‌లో 26 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. భద్రాచలంలో 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. 500కుపైగా పోలింగ్ కేంద్రాలు ఉన్న ఆరు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటలకు మొదటి ఆధిక్యం తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ పడిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
ఓట్ల లెక్కింపు ఇలా
తొలుత పోస్టల్ లోట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. తర్వాత అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం నుంచి కంట్రోల్ యూనిట్‌లను టేబుల్‌కు ఒకటి చొప్పున బయటకు తీసుకొస్తారు. ముందుగా టోటల్ బటన్ నొక్కి ఎన్ని సీట్లు పోలయ్యాయో తెలుసుకుంటారు. వీటిని ముందుగగా నమోదు చేసిన రికార్డుతో సరిపోలుస్తారు.
తర్వాత రిజల్ట్స్ బటన్ నొక్కగానే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. 14 ఈవీఎంల లెక్కింపు పూర్తి అయితే 1 రౌండు ముగిసినట్లు. అభ్యర్థులు, ఓటర్లు ఎక్కువ ఉన్న చోట్ల 28 యూనిట్ల లెక్కింపును ఒక రౌండుగా భావిస్తారు. కౌంటింగ్ పూర్తయ్యాక పరిశీలకుడు, ఏజెంట్ల సమక్షంలో 5 వీవీ ప్యాట్స్‌ను ఎంపిక చేసి ఓటరు స్లిప్పులు లెక్కిస్తారు. రికార్డు చేసిన ఓట్లతో సరిపోలితే అధికారులు, ఏజెంట్ల ఆమోదంతో ఫలితాన్ని ప్రకటిస్తారు.
నేడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ ఫలితాలు లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు. దీంతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మిజోరంలో కౌంటింగ్ రేపు జరగనుంది.