తెలంగాణలో హోరా హోరీ.. ఆధిక్యంలో ఎవరంటే?
తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది.
By అంజి Published on 3 Dec 2023 9:00 AM ISTతెలంగాణలో హోరా హోరీ.. ఆధిక్యంలో ఎవరంటే?
తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. ఎన్నికల కౌంటింగ్ హోరా హోరీగా కొనసాగుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో తొలుత ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టామని అధికారులు తెలిపారు. తెలంగాణ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ 53, బీఆర్ఎస్ 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ, ఎంఐఎం చెరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఈవీఎం తొలి రౌండ్ ఫలితం వెలువడింది. అశ్వారావుపేటలో తొలి రౌండ్ పూర్తవగా కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణకు 4318, బీఆర్‌ఎస్ అభ్యర్థి నాగేశ్వరరావుకు 2570 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి 1748 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. భువనగిరి, ఇల్లందు, నల్గొండలోనూ హస్తం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది.
మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైందని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) అరగంట తర్వాత తెరవబడ్డాయి. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కేంద్రాల చుట్టూ నిషేధాజ్ఞలు విధించి భద్రతను కట్టుదిట్టం చేశారు. 1,798 టేబుళ్లను ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు మొత్తం 2,417 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో 71.34 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. 2018 ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఇది దాదాపు 2 శాతం తక్కువ. మొత్తం 3,26,02,793 మంది ఓటర్లలో 2,32,59,256 మంది ఓటు వేశారు. 2018 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) 88 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 19 సీట్లు గెలుచుకుంది.