సిరులు కురిపిస్తున్న తెల్ల‌బంగారం

Cotton prices touches record high in Telangana.ప‌త్తిని తెల్ల బంగారం అని పిలుస్తుంటారు. ఈ సారి ఈ తెల్ల‌బంగారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Dec 2021 7:27 AM GMT
సిరులు కురిపిస్తున్న తెల్ల‌బంగారం

ప‌త్తిని తెల్ల బంగారం అని పిలుస్తుంటారు. ఈ సారి ఈ తెల్ల‌బంగారం కాసుల పంట పండిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సీఐఐ ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువ డబ్బులు చెల్లించి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇక ఖ‌మ్మం వ్య‌వ‌సాయ మార్కెట్‌లో క్వింటా ప‌త్తి ధ‌ర రూ.9వేలు దాటింది. దీంతో రైతులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సారి దిగుబ‌డి త‌గ్గ‌డంతో విప‌ణికీ స‌ర‌కు ఎక్కువ‌గా రావ‌డం లేదు. దీంతో వ్యాపారులు పోటీప‌డి స‌ర‌కు కొనుగోలు చేస్తుండ‌డంతో ప‌త్తికి అత్య‌ధిక ధ‌ర ల‌భిస్తోంది.

గురువారం ఖ‌మ్మంలో క్వింటాల్ ప‌త్తి రూ.9600 ప‌లికింది. ఈ నెల 27న క్వింటా రూ.8వేలు ఉన్న ప‌త్తి ధ‌ర ఆ త‌రువాత ఒక్క‌సారిగా పెరిగింది. ప్ర‌భుత్వం క్వింటాకు రూ.6,025 క‌నీస మ‌ద్ద‌తు ధ‌రగా నిర్ణ‌యించ‌గా.. ఇప్పుడు దానికంటే రూ.3వేలకు పైగా ధ‌ర ల‌భించ‌డం విశేషం. ఇంత‌టి తేడా గ‌తంలో ఎన్న‌డూ లేదు. ఖ‌మ్మం మార్కెట్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో పత్తి ధర అత్యధికంగా క్వింటాల్‌కు రూ.9,100 ధర పలికింది. మరోవైపు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర గురువారం క్వింటాల్‌కు రూ. 8,805 పలికింది. గతేడాది పోలిస్తే ఈసారి ధరలు ఎక్కువగా ఉన్నాయని రైతులు అంటున్నారు.

రాష్ట్రంలో ప‌త్తి మార్కెట్ల‌లో గురువారం ధ‌ర‌లు(క్వింటాకు) ఇలా ..

ఖ‌మ్మంలో రూ.9100, ఇంద్ర‌వెల్లిలో రూ.8,650, ఆదిలాబాద్‌లో రూ.8,650, బోథ్‌లో రూ.8,650, ఇచ్చోడ‌లో రూ.8,850, జ‌మ్మికుంటలో రూ.8,850, వ‌రంగ‌ల్ లో రూ.8,805, ఏన్కూర్‌లో 9,050 ధ‌ర ప‌లికింది.

పత్తి ధరలపై అధికారులు మాట్లాడుతూ.. గత మూడేళ్లలో పత్తికి లభించిన అత్యధిక ధర ఇదేన్నారు. ఇటీవ‌ల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గిందని.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉత్పత్తులకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటం కూడా ధరల పెరుగుదలకు కారణమైందన్నారు. ఇక.. సీజన్ ప్రారంభంలో పత్తి క్వింటాల్‌కు రూ. 6వేలు ప‌లుక‌గా.. గత రెండు నెలలుగా ధరలు పెరుగుతూ వచ్చాయి.

Next Story