తెలంగాణలోని 2008 డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారిని కాంట్రాక్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్‌లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1,382 మందికి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం కల్పిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి కాంట్రాక్టు విధానంలో ప్రతి నెలా రూ.31,040 వేతనంతో నియమించుకుంటున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగంలో చేరిన వారి కాంట్రాక్టును ప్రతి విద్యా సంవత్సరంలో రెన్యూవల్ చేస్తామని తెలిపింది.
2008 డీఎస్సీ బాధితులకు సంబంధించిన ఉద్యోగాల భర్తీని చేపట్టమని గతంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉద్యోగ నియామకాల విషయంలో జాప్యం చేస్తుండటంతో అభ్యర్థులు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా పాటించరా అంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహా రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. డీఎస్సీ 2008 అభ్యర్థులు ఏళ్ల తరబడి నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని, కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయరా? అంటూ కొద్దిరోజుల క్రితం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహారెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. కనీసం కోర్టు ఉత్తర్వులను అయినా గౌరవించాలని కమిషనర్‌కు సూచించింది.