'100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం'.. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు పూర్తి ఆధునిక‌ వ‌స‌తుల‌తో ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణం ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు.

By అంజి  Published on  26 Jan 2025 8:26 AM IST
Osmania Hospital, CM Revanth, Hyderabad

'100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం'.. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌: రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు పూర్తి ఆధునిక‌ వ‌స‌తుల‌తో ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణం ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఆసుప‌త్రి కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి ఏ విష‌యంలోనూ రాజీప‌డొద్ద‌ని అధికారుల‌కు సూచించారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణానికి ఈ నెల 31న ముఖ్య‌మంత్రి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఉస్మానియా ఆసుప‌త్రి భ‌వ‌న నిర్మాణాల‌తో పాటు బోధ‌న సిబ్బంది, విద్యార్థి, విద్యార్థినుల‌కు వేర్వురుగా నిర్మించే హాస్ట‌ల్ భ‌వ‌నాల విష‌యంలోనూ పూర్తి నిబంధన‌లు పాటించాల‌ని చెప్పారు. ఆసుప‌త్రి నిర్మాణంపై మంత్రి దామోదర, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్య‌మంత్రి స‌మీక్షించి పలు సూచనలు చేశారు.

సీఎం చేసిన సూచనలు ఇవే

ఆసుప‌త్రి భ‌వ‌న నిర్మాణాలు, పార్కింగ్‌, ల్యాండ్ స్కేప్ విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఆసుప‌త్రికి రాక‌పోక‌లు సాగించేలా న‌లువైపులా ర‌హదారులు ఉండాలి. అవసరమైన చోట ఇత‌ర మార్గాల‌ను క‌లిపేలా అండ‌ర్‌పాస్‌లు నిర్మించాలి. ఆసుప‌త్రికి వ‌చ్చే రోగులు, స‌హాయ‌కులు, విజిటర్స్ వాహ‌నాలు నిలిపేందుకు వీలుగా అండ‌ర్‌గ్రౌండ్‌లో రెండు ఫ్లోర్ల‌లో పార్కింగ్ ఉండాలి. డార్మిట‌రీ, ఫైర్ స్టేష‌న్, క్యాంటిన్‌, మూత్ర‌శాల‌లు, ఎస్టీపీలు నిర్మించాలి. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా పిల్ల‌లు విదేశాల్లో స్థిర‌ప‌డిన వారు వ‌చ్చేందుకు రెండు మూడు రోజులు ప‌డుతోంద‌ని.. అప్ప‌టి వ‌ర‌కు మృత‌దేహాల‌ను భ‌ద్ర‌ప‌ర్చేందుకు ఆధునిక సౌక‌ర్యాల‌తో మార్చురీ, బాడీ ఫ్రీజింగ్ సదుపాయాలతో నిర్మాణాలు ఉండాలి. అవ‌య‌వాల మార్పిడి.. అత్య‌వ‌స‌ర స‌మయాల్లో రోగుల త‌ర‌లింపున‌కు వీలుగా హెలీ అంబులెన్స్‌లు వినియోగిస్తున్నందున హెలీప్యాడ్ నిర్మాణం కూడా చేప‌ట్టాలి. ఆసుప‌త్రిలో అడుగుపెట్ట‌గానే ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఉండాలే తప్ప ఆసుప‌త్రికి వ‌చ్చామ‌న్న భావ‌న రాకుండా తీర్చిదిద్దాలి. ఆసుప‌త్రి భ‌వ‌న నిర్మాణాల‌కు సంబంధించిన న‌మూనాల్లో ప‌లు మార్పులు చేర్పుల‌ను సూచించారు.

Next Story