తుక్కుగూడ నుంచి ప్రచారానికి నేడు కాంగ్రెస్‌ శంఖారావం

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచారానికి సిద్ధం అవుతోంది కాంగ్రెస్.

By Srikanth Gundamalla  Published on  6 April 2024 1:50 AM GMT
congress, tukkuguda meeting, parliament election, telangana ,

తుక్కుగూడ నుంచి ప్రచారానికి నేడు కాంగ్రెస్‌ శంఖారావం 

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచారానికి సిద్ధం అవుతోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే శనివారం తుక్కుగూడ నుంచి ప్రచారానికి శంఖారావం పూరించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలోనే కాంగ్రెస్‌ పార్టీ ప్రజాగర్జన సభ నిర్వహించింది. అక్కడి నుంచే ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తుక్కుగూడలో సభను నిర్వహించడం సెంటిమెంట్‌గా భావిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు కూడా శంఖారావ సభను ఇక్కడి నుంచే నిర్వహిస్తోంది.

జనజాతర పేరుతో కాంగ్రెస్‌ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా జనాన్ని సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్ పార్టీ. జనసమీకరణ బాధ్యతను పార్టీ అభ్యర్థులతో పాటు టీపీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌రెడ్డి కూడా తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి జనాలను తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. అయితే సభకు వస్తున్న వారిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకుగాను ప్రభుత్వం ఇప్పటికి అమలు చేసిన ఐదు గ్యారెంటీల లబ్ధిదారుల్లో మహిళలే అధికం కావడంతో.. సభలో వారి భాగస్వామ్యం ఎక్కువ ఉండేలా చూస్తున్నారు.

ఈ సభలో రాహుల్‌గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొనాలి ఉంది. కానీ.. ఆమె చివరి నిమిషయంలో రద్దు చేసుకున్నారు. తుక్కుగూడ తరహాలోనే రాజస్థాన్‌లో మేనిఫెస్టో విడుదల సభ ఉంది. దాంతో.. రాహుల్‌గాంధీ తెలంగాణకు.. ప్రియాంక గాంధీ రాజస్థాన్‌కు వెళ్తున్నారు. ఇక తుక్కుగూడ సభ ద్వారా కాంగ్రెస్ మేనిఫెస్టో తెలుగు ప్రతిని రాహుల్‌గాంధీ ప్రజలకు అంకితం చేస్తారు. మేనిఫెస్టోతోపాటు ‘పాంచ్‌ న్యాయ్‌’ గ్యారెంటీల తెలుగు ప్రతులనూ విడుదదల చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న హామీలను ప్రకటించనున్నారు. ఈ సభ ద్వారా రాహుల్‌గాంధీ ప్రసంగం హాట్‌గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రధాని మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయనున్నారు. అలాగే గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్‌ గురించి కూడా మాట్లాడనున్నారు. మరోవైపు ఈసభకు వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండల వేడిమి ఎక్కువగా ఉన్న కారణంగా.. మజ్జిగ ప్యాకెట్లు ఇ్వనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ సభ ప్రారంభం కాబోతుంది. సభ ప్రాంగణంలో 24 లక్షల వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచనున్నారు. సభకు వస్తున్నవారికి మార్గమధ్యంలో భోజన సదుపాయాలను కూడా కల్పించే బాధ్యతను స్థానిక నాయకత్వం తీసుకుంది.

Next Story