భట్టి విక్రమార్క నాకు ద్రోహం చేస్తున్నారు: వీహెచ్

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  10 March 2024 1:30 PM IST
congress,  v hanumantha rao,  khammam ticket, bhatti,

భట్టి విక్రమార్క నాకు ద్రోహం చేస్తున్నారు: వీహెచ్ 

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు. ఖమ్మం లోక్‌సభ సీటు తనకు రాకుండా అడ్డుపడుతున్నారంటూ ఆరోపణ చేశారు. భట్టి విక్రమార్క తనకు ద్రోహం చేస్తున్నారని ఆయన అన్నారు. భట్టి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. మొదట లోక్‌సభ ఎన్నికల్లో సీటు ఇస్తామని చెప్పారనీ.. కానీ ఇప్పుడు తనని పట్టించుకోవడం లేదంటూ వి. హనుమంతరావు ఆవేదన చెందారు. భట్టి ఇవాళ కాంగ్రెస్‌లో ఈ స్థానంలో ఉన్నాడంటే తానే కారణమని చెప్పారు. భట్టిని ఎమ్మెల్సీని చేసిందే తానని అన్నారు.

తన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరని వీహెచ్‌ అన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తనకు న్యాయం చేయాలని కోరారు. అయితే.. కొందరు నాయకులు తాను లోకల్ కాదని అంటన్నారని.. రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్యనాయుడు వీళ్లంతా లోకలా? అని భట్టి విక్రమార్కను ప్రశ్నించారు. పార్టీ కోసం పదవులు ఆశించకుండా ఇంతకాలం తాను పనిచేశానని గుర్తు చేశారు. అందుకే తనకు ఇప్పుడు న్యాయం చేయాలని కోరుతున్నట్లు వీహెచ్ చెప్పారు.

ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి తనకు అవకాశం కల్పిస్తే తాను కచ్చితంగా గెలుస్తాననే దీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. కాంగ్రెస్‌ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. బీసీ ఓట్లు కాంగ్రెస్‌కు అవసరం లేదా అని ప్రశ్నించారు. బీసీలు ఓట్లే వేసే మిషన్లా అన్నారు. రాహుల్‌గాంధీ జోడో న్యాయ్‌ యాత్ర, కులగణన అంటున్నారనీ.. తనకు రాహుల్‌గాంధీ న్యాయం చేయాలని కోరారు. తాను ఇన్నాళ్లు పార్టీ కోసం మాత్రమే పనిచేశాననీ.. చచ్చే వరకూ కాంగ్రెస్‌లోనే ఉంటానని అన్నారు. కాంగ్రెస్‌లో ఎంతో మంది నాయకులకు తాను సాయం చేసినట్లు చెప్పారు. తనకు వయసు ఏమీ అయిపోలేదన్నారు. ఈ వయసులో కూడా రన్నింగ్‌ రేస్‌లో పాల్గొంటానన్నారు. ఖమ్మం నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తే తానే తప్పుకుంటానని.. లేదంటే ఆ టికెట్‌ తనకు కేటాయించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు.

Next Story