'కాంగ్రెస్ ఇచ్చిన.. ఆ హామీ ఇప్పట్లో అమలు కాదు'.. ఎమ్మెల్యే కూనంనేని
ఎలక్షన్ టైమ్‌లో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీపై కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
By అంజి
'కాంగ్రెస్ ఇచ్చిన.. ఆ హామీ ఇప్పట్లో అమలు కాదు'.. ఎమ్మెల్యే కూనంనేని
ఎలక్షన్ టైమ్‌లో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీపై కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకంలో భాగంగా 10గ్రాముల బంగారం ఇస్తామన్న హామీని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పట్లో అమలు చేసే స్థితిలో లేదని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన నూతన వధువులకు రూ.1,00,116 లతో పాటు ఒక తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తులం బంగారం ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చునని సాంబశివరావు అన్నారు.
శుక్రవారం ఇక్కడ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతున్నదని, ఇది రాష్ట్ర ఖజానా దుస్థితిని సూచిస్తుందని ఆయన అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, దాని పరిస్థితి డోలాయమానంలో ఉందని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎవరికీ రూపాయి కూడా ఇవ్వొద్దని కూనంనేని సూచించారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధులు విడుదల చేయడంలో జాప్యం కారణంగా, బాలికల వివాహాలు ఏర్పాటు చేసుకున్న పేద కుటుంబాలు ఇప్పటికే ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని అన్నారు. చాలా కుటుంబాలు ప్రైవేట్ ఫైనాన్షియర్ల నుండి డబ్బు అప్పుగా తీసుకోవలసి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరి, పత్తి, మొక్కజొన్న, కంది వంటి 10 రకాల పంటలకు హామీ ఇచ్చిన రూ. 500 బోనస్‌ను అందించడంలో ఇప్పటికే విఫలమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు హామీ ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇంకా అందలేదు, పాత బకాయిలను కూడా చెల్లించలేదు.