తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. ''నేను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మవద్దు.. మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. నేను అధికారికంగా ప్రకటించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాననడం తప్పుడు ప్రచారం'' అని పేర్కొన్నారు.
''మొన్న రాహుల్ గాంధీ ఎంపీ పదవి అనర్హతను నిరసిస్తూ గాంధీభవన్ లో చేసిన దీక్షలో పాల్గొన్నా. భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. నా ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవు.. నాది కాంగ్రెస్ రక్తం. బీజేపీ నుంచి ఎలాంటి ఆఫర్లు లేవు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కొత్త పార్టీ పెడుతున్నానని తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి. నేను పార్టీ మారతాననేది ఊహాగానమే. గతంలోనూ ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేశారు'' అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు.
''ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసి కొందరు లబ్ధి పొందాలని అనుకోవడం హుందాతనం అనిపించుకోదు. కాంగ్రెస్ లో 35 ఏళ్లుగా పని చేస్తున్నా. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశా. మరోసారి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది'' అంటూ హెచ్చరించారు.