గులాబీ కళ్లజోడుతో చూడడం ఆపండి.. అన్ని కనిపిస్తాయి : కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ కౌంటర్
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
By Medi Samrat Published on 25 Jan 2025 3:28 PM ISTగత పది సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే అభివృద్ధి చేసి చూపిస్తుంటే, వాళ్లు 9 సంవత్సరాలలో తేలేని పెట్టుబడులను తెచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పన చేస్తుంటే.. చూసి ఓర్వలేక కడుపు మంటతో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉంటే వాళ్లకు ఈనో ప్యాకెట్స్ తాగమని చెప్పామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివాఆరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్లో మంత్రినా.. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పెద్ద పాలేరా అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాలికి ముల్లుకుచ్చుకుంటే కిషన్ రెడ్డి నోటితో తీస్తా అనే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అభివృద్ధికి భిన్నంగా మాట్లాడితే ఊరుకునేది లేదని కిషన్ రెడ్డిని హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డి రూ.1,78,950 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు.. శుభం పలకరా పెళ్ళికొడుకు అంటే పెళ్లికూతురు ముండ మోసిందట అనే సామెత మాదిరి మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు స్క్రిప్టులు షేర్ చేసుకొని మరీ ప్రెస్ మీట్ లలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ బిడ్డలకు ఉపాధి కల్పన కోసం దావోస్ వెళ్లి పెట్టుబడులు తెస్తుంటే.. ప్రెస్ మీట్ లు పెట్టి ప్రతిపక్షాలు అబద్ధాలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణ ప్రజల వల్లనే మీకు ఎనిమిది పార్లమెంట్ సీట్లు వచ్చాయి కదా.. మరి తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంటే మంచి అనే ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు.. టీఆర్ఎస్ బాటలోనే మీరు వెళ్తున్నారు.. తెలంగాణ ఏ దేశంలో ఉంది కిషన్ రెడ్డి అని ప్రశ్నించారు. మీరు బాధ్యతగల హోదాలో ఉన్నారు.. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి.. అవగాహన లేకుండా మాట్లాడుతున్నాని విమర్శించారు. ఒక్క తెలంగాణ నుండే దావోస్‌కి వెళ్లలేదు.. దేశవ్యాప్తంగా అందరూ వెళ్లారు.. గులాబీ కళ్లజోడుతో చూడడం ఆపితే మీకు అన్ని కనిపిస్తాయి.. కనువిప్పు కలుగుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విషయంపై టీఆర్ఎస్ ఎందుకు స్పందిస్తలేదు, ఈటెల విషయాన్ని మీరు ఏకీభవిస్తున్నట్టా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అని తెలంగాణ ప్రజలకు అర్థమయిపోయింది. మీ బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల నుండి కూడా ముఖ్యమంత్రులు మంత్రులు వెళ్లారు కదా.. మీ ముఖ్యమంత్రులను, మీ బీజేపీ మంత్రులను సవాల్ చేయగలుగుతావా అని సవాల్ విసిరారు. మీరు దేశానికి మంత్రి.. రాష్ట్రం గురించి మాట్లాడొద్దు.. లేనిపోని అబాండాలతో పెట్టుబడిదారులను.. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. అబద్ధాలు మాట్లాడడం మానేసి రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించాలని సూచించారు.
ఇదిలావుంటే.. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడున్న వారినే దావోస్ తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకున్నారంటూ కామెంట్ చేశారు. తెలంగాణలో ఎవరూ కాంట్రాక్టులు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని అన్నారు. దావోస్ పర్యటనతో లాభం చేకూరుతుందంటే ఎలాంటి వమర్శలు అవసరం లేదని తెలిపారు. కానీ, తెలంగాణ వారినే దావోస్ తీసుకెళ్లి.. అక్కడ అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని.. కేవలం ఒప్పందాలు పేపర్‌పైనే పరిమితం కావొద్దని కిషన్ రెడ్డి అన్నారు.