ఎల్ఎల్‌ఎం ఎంట్రన్స్ పరీక్ష రాసిన ఎమ్మెల్యే సీతక్క

Congress MLA Sitakka wrote the LLM Entrance Exam. కాంగ్రెస్‌ నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశం కోసం ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ రాశారు.

By అంజి  Published on  22 July 2022 5:37 PM IST
ఎల్ఎల్‌ఎం ఎంట్రన్స్ పరీక్ష రాసిన ఎమ్మెల్యే సీతక్క

కాంగ్రెస్‌ నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశం కోసం ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ రాశారు. అటు రాజకీయాలు, ఇటు నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఎప్పుడు బిజీగా ఉండే సీతక్క.. ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రవేశ పరీక్ష రాశారు. ఈ విషయాన్ని సీతక్కనే సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ''నేను నా ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్ష రాశాను. విద్యార్థి జీవితమే ఉత్తమ జీవితం'' అంటూ ట్వీట్‌ చేశారు. దాన్ని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు. సీతక్క చేసిన ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కామెంట్స్ చేస్తూ.. సీతక్కపై తమకున్న అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కూడా సీతక్కను అభినందించింది. సీతక్క (ధనసరి అనసూయ) నిరుపేద కుటుంబంలో పుట్టారు. చదువుకునే సమయంలోనే నక్సల్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. చాలా కాలం మావోయిస్టులతో కలిసి పని చేశారు. ఆ ఉద్యమం సమయంలోనే ఆమె పేరు సీతక్కగా మారింది. ఆ తర్వాత సీతక్క జనజీవన స్రవంతిలో కలిశారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. సీతక్క పేదలకు సేవలు చేయడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా సమయంలో మరుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు సరుకులు పంపిణీ చేశారు. సీతక్క పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లగా.. చాలామంది ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. సీతక్క ఓపిగ్గా అందరితో సెల్ఫీలు దిగింది. చిన్న పిల్లలను ఎత్తుకొని ముద్దు చేసింది.



Next Story