తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి వస్తుందనే అనుకుంటున్నా. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలి. భువనగిరి పార్లమెంట్ బాధ్యతలు ఇస్తే సమర్థవంతంగా నిర్వహించా. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తా, ప్రజల పక్షాన నిలబడతా. నిన్న ఢిల్లీలో సీరియస్‌గానే కేబినెట్ విస్తరణపై చర్చ జరిగినట్లు ఉంది. అయితే నాకు ఇప్పటివరకు ఢిల్లీ నుంచి ఫోన్ రాలేదు..అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం అమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు మంత్రి వర్గ విస్తరణకు సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజా మంత్రి వర్గ విస్తరణలో కనీసం నలుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేయనున్నారు.