Telangana: ఇంటింటికీ కాంగ్రెస్‌ నేతలు.. ఆరు గ్యారంటీల అమలుకు హామీ

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ నేతలు ఆరు హామీల కార్డులను పంపిణీ చేశారు.

By అంజి  Published on  19 Sep 2023 6:09 AM GMT
Congress leaders, Telangana, six guarantees, CWC

Telangana: ఇంటింటికీ కాంగ్రెస్‌ నేతలు.. ఆరు గ్యారంటీల అమలుకు హామీ

హైదరాబాద్‌లో 'విజయ భేరి' బహిరంగ సభ అనంతరం సెప్టెంబర్ 18వ తేదీ సోమవారం నుండి తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ నేతలు ఆరు హామీల కార్డులను పంపిణీ చేశారు. రెండు రోజుల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం, గత రాత్రి బహిరంగ సభ ముగిసిన తరువాత, వివిధ రాష్ట్రాల నుండి కాంగ్రెస్ అగ్రనేతలు తమకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లి రాత్రి అక్కడే గడిపారు. సోమవారం ఈ నాయకులు స్థానిక పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌ చేసిన వాగ్దానాలు, రాష్ట్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరిన కాంగ్రెస్ నాయకులు, పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం ఆరు హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లోని నాంపల్లి నియోజకవర్గంలో సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ యూనియన్ సచిన్ పైలట్ పర్యటించారు. స్థానిక ప్రజలతో మమేకమై ఆరు హామీలను వివరించారు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటే అన్ని హామీలను అమలు చేస్తాం అని మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ శరవేగంగా బలపడుతోందని, మళ్లీ పుంజుకుంటోందని చెప్పారు. తెలంగాణలో పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సచిన్ పైలట్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న జనం ఉత్సహాన్ని చూశాం.. లక్షలాది మంది బహిరంగ సభకు హాజరయ్యారని.. తమ భవిష్యత్తు కాంగ్రెస్ తోనే అని యువత గ్రహించారని అన్నారు. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి అన్నారు

సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సలాం ఖుర్షీద్.. హన్మకొండ నియోజకవర్గాన్ని సందర్శించారు. మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి, సీఎల్పీ నాయకుడు ఓక్రమ్ ఇబోబి సింగ్ షాద్‌నగర్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల జీవన విధానంలో కాంగ్రెస్ సమూల మార్పులు తీసుకువస్తుందని అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌తో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ఆరు హామీలను వివరించారు. ప్రజలకు హామీ కార్డులను అందజేశారు.

తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి రూబీ మనోహరన్ ప్రచారంలో పాల్గొనేందుకు పెద్దపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన వెంట పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చింతకుంట విజయరామారావు, ఇతర నాయకులు ఉన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఏఐసీసీ కార్యదర్శి (సంస్థ) వంశీచంద్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని గిరిజన తండాలో రాత్రి బస చేసిన అనంతరం ఆయన ఇంటింటికీ వెళ్లి ఆరు హామీలను ప్రజలకు వివరించారు. గుజరాత్ సీఎల్పీ నేత అమిత్ చావ్డా ప్రచారంలో పాల్గొనేందుకు పటాన్చెరు నియోజకవర్గంలో పర్యటించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఉత్తరాఖండ్ సీఎల్పీ నేత యశ్‌పాల్ ఆర్య స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు.

పరిగి నియోజకవర్గంలో సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రంధవా ఆరు హామీల కార్డులను పంపిణీ చేశారు. జనగాం నియోజకవర్గంలో ఏఐసీసీ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల చైర్‌పర్సన్‌ సుప్రియ శ్రీనాతే నేతృత్వంలో ప్రచారం జరిగింది. సీడబ్ల్యూసీ సభ్యురాలు అల్కా లాంబా రామగుండం నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుందో వివరించారు.

కర్ణాటకలో సాధించిన విజయాన్ని తెలంగాణలోనూ పునరావృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం మహిళలు, రైతులు, నిరాశ్రయులు, యువత, సీనియర్‌ సిటిజన్‌ల వంటి వివిధ వర్గాలకు ఆరు హామీలను ప్రకటించింది. ప్రతి మహిళకు రూ. 2,500 ఆర్థిక సహాయం, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న TSRTC బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వంట గ్యాస్ సిలిండర్ రూ.500, కౌలు రైతులతో సహా రైతులకు ఎకరాకు రూ.15,000 ఆర్థిక సహాయం, వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి రూ. 12,000, సంవత్సరానికి రూ. 12,000 సహాయం వంటి హామీలను కాంగ్రెస్‌ ఇచ్చింది.

Next Story