స్వరాష్ట్రంలో ఈ నిర్బంధమేంటి.? నిప్పులు చెరిగిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Congress Leader Komatireddy Venkatreddy Fire On BRS govt. కాంగ్రెస్ సభపై ఆంక్షలు తగదని ప్రభుత్వంపై భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

By Medi Samrat  Published on  2 July 2023 10:07 AM GMT
స్వరాష్ట్రంలో ఈ నిర్బంధమేంటి.? నిప్పులు చెరిగిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ సభపై ఆంక్షలు తగదని ప్రభుత్వంపై భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న జనగర్జన సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం కరెక్ట్ కాదని అన్నారు. రాహుల్​ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటి? అని ప్ర‌శ్నించారు. 4 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తుందని అన్నారు. కేసీఆర్ నేను చెప్పేది ఒక్కటే.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు పోరాటాలు, సభలు, ధర్నాలు చేసుకునే హక్కు ఉందని అన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ సభకు నిన్న రాత్రి నుంచి ఆంక్షలు పెట్టారు.. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఆర్టీసీ వాహనాలను డబ్బులు కడతామన్నా ఇవ్వలేదు. సరే అని ప్రైవేట్ వాహనాల్లో జనం సభకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా.. ఆర్టీసీ బస్సులు వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. కాంగ్రెస్ సభకు భయపడి ప్రభుత్వం బస్సులను ఇవ్వలేదు. పైగా కక్ష కట్టి ప్రైవేట్ వాహనాలను ఆపి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. జనాన్ని కాంగ్రెస్ సభకు రాకుండా అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామ‌న్నారు. పోలీసులు న్యాయంగా డ్యూటీ చేయాలి.. సభా ప్రాంగణానికి 15, 20 కిలోమీటర్ల దూరంలో ఆపేయడం కరెక్ట్ కాదని అన్నారు. 35 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. కేసీఆర్ వెంటనే సభను సజావుగా సాగేందుకు పోలీసులకు సూచనలు చేయాలి. లేదంటే జరిగే పరిణామాలకు మీదే బాధ్యత వ‌హించాల్సివుంటుంద‌ని అన్నారు.

ఎక్కడ వాహనాలు ఆపినా అక్కడికి వేలాదిగా బైకులపై వెళ్తాం.. జనగర్జన జరిపి తీరుతాం.. ఏం జరిగినా మీదే బాధ్యత అని హెచ్చరించారు. మేం ప్రజల పక్షాన పోరాడేందుకు సభలు, పోరాటాలు చేస్తుంటే ఇలా నిర్బంధ చర్యలు చేయడం తగదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటివి చూడలేదు.. స్వరాష్ట్రంలో ఈ నిర్బంధమేంటి? అని ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే పోలీసులు ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

9 ఏళ్లుగా కాంగ్రెస్ శ్రేణులను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినా న్యాయపరంగా పోరాడుతున్నామే గానీ, హద్దు మీరలేదు. కానీ, ఇప్పుడు లక్షలమంది సభకు వస్తుండడం చూసి ఓర్వలేక ఆంక్షలు విధిస్తారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముందే హెచ్చరిస్తున్నాం... ఏం జరిగినా మాకేం సంబంధం లేదు.. సభ తప్పకుండా జరుగుతుంది.. నన్ను అరెస్ట్ చేసినా సరే.. తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తోంది.. వాహనాలు సీజ్ చేయడం, అక్రమ అరెస్టులు చేయడం ఏంటి? జరగరానిది ఏం జరిగినా ప్రభుత్వం, ముఖ్యమంత్రిదే బాధ్యత అని హెచ్చరించారు.


Next Story