కాంగ్రెస్ పార్టీ నారాయణ్‌ఖేడ్‌లో అభ్యర్థిని మార్చింది. ముందుగా సురేష్‌కుమార్ షెట్కార్‌కు నారాయణ్‌ఖేడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కాంగ్రెస్.. ఇవాళ అతడి స్థానంలో డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ల గడువుకు కొన్ని గంటల ముందు ఈ ఆసక్తికరపరిణామం చోటు చేసుకుంది. నారాయణ్‌ఖేడ్ అభ్యర్థి మార్పునకు సంబంధించిన ప్రతిపాదనను తెలంగాణ పీసీసీ కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లింది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది
ఇక పటాన్‌చెరు నియోజకవర్గంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి మార్పు వెనుక దామోదర రాజనర్సింహ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన పంతం నెగ్గించుకున్నారు. దామోదర రాజనర్సింహ అనుచరుడు కాటా శ్రీనివాస్ గౌడ్‌కు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఎం మధ్య చర్చలు విఫలమయ్యాయి. చివరి రోజు వరకు మిర్యాలగూడ టికెట్‌ను సీపీఎం కోసం కాంగ్రెస్ పార్టీ ఆపింది. చర్చలు ఫలించకపోవడంతో అభ్యర్థిని ప్రకటించింది.