రేవంత్‌ రెడ్డి కొత్త పార్టీ పెడతారంటూ రూమర్స్‌.. కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం

Congress complaint against fake news over Revanth Reddy New Party. తెలంగాణ కాంగ్రెస్‌లో కొన్నాళ్ల నుంచి వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పార్టీలో ఒకరంటే.. ఒకరికి అస్సలు

By అంజి  Published on  27 Dec 2022 8:10 AM GMT
రేవంత్‌ రెడ్డి కొత్త పార్టీ పెడతారంటూ రూమర్స్‌.. కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం

తెలంగాణ కాంగ్రెస్‌లో కొన్నాళ్ల నుంచి వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పార్టీలో ఒకరంటే.. ఒకరికి అస్సలు పడట్లేదు. ఇటీవల సీనియర్లు, జూనియర్లు అంటూ రెండు వర్గాలు విడిపోయారు. ఆ తర్వాత సీనియర్లు పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే హైకమాండ్‌ దూతగా వచ్చిన దిగ్విజయ్‌ సింగ్‌.. నాయకులతో మాట్లాడి వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఆల్‌ సెటిల్డ్‌, నో ప్రాబ్లమ్‌ అని చెప్పి దిగ్విజయ్‌ సింగ్‌ వెళ్లారు. ఇలాంటి సమయంలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంతంగా రాజకీయ పార్టీ పెట్టనున్నారనే ప్రచారం సోషల్‌మీడియా వేదికగా దావానలంలా వ్యాపిస్తోంది.

రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుండి వైదొలుగుతున్నారని పుకార్లు వచ్చాయి. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటవుతుందని, రేవంత్ రెడ్డి కొత్త పార్టీని రిజిస్ట్రేషన్‌ చేయించారని సోమవారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ఈ పార్టీకి 'తెలంగాణ సామాజిక కాంగ్రెస్ పార్టీ' అని పేరు పెట్టనున్నట్టు భారీ ప్రచారం జరిగింది. అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేసిన శంకర్ అనే వ్యక్తిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేష్ కుమార్ గౌడ్ సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న శంకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ఇదే విషయమై టీపీసీసీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం ఇక్కడ గమనార్హం. ప్రచారం చేస్తున్న వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్ వివరాలను పోలీసులకు సమర్పించారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదులతో చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. కాగా ఇలాంటి రూమర్స్‌ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండటంతో కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు.

Next Story