బీఆర్‌ఎస్‌లోకి 12 మంది ఎమ్మెల్యేలు.. పీఎస్‌లో టీ కాంగ్రెస్‌ ఫిర్యాదు

Congress complained in PS against 12 MLAs who switched to BRS. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ.. తమ పార్టీలో జరిగిన ఫిరాయింపులపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది.

By అంజి  Published on  6 Jan 2023 3:25 PM IST
బీఆర్‌ఎస్‌లోకి 12 మంది ఎమ్మెల్యేలు.. పీఎస్‌లో టీ కాంగ్రెస్‌ ఫిర్యాదు

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ.. తమ పార్టీలో జరిగిన ఫిరాయింపులపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. కేసీఆరే టార్గెట్‌గా కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహాలు పన్నుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై విచారణ జరుగుతున్న టైంలో ఇలా తమ పార్టీలో జరిగిన ఫిరాయింపులపై కాంగ్రెస్‌ పార్టీ దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. గతంలో జరిగిన ఫిరాయింపులపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తమ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి మారిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, రామ్మోహన్ రెడ్డి, సంపత్ కుమార్ , గడ్డం ప్రసాద్, మల్లు రవి కలిసి మొయినాబాద్ పోలీస్ స్టేషన్​కు వెళ్లి కాంగ్రెస్‌ నుంచి బీఆర్​ఎస్​లోకి చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. బీఆర్​ఎస్​లో చేరి 12 మంది ఎమ్మెల్యేలు పొందిన ఆర్థిక, రాజకీయ లబ్ధిపై ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిట్, సీబీఐ, హైకోర్టులలో వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఈ విషయంలో ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ ప్రలోభాలకే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కాంగ్రెస్‌ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లిన వారిలో పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ , కొల్లాపూర్ నుండి బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూర్ నుంచి గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు.

Next Story