తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. త్వరలో తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీని తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్‌ఆర్టీసీ) చేపట్టనుంది. మొత్తం 3 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉండగా.. తొలుత 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. 13 ఏళ్ల నుంచి కండక్టర్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందితోనే ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. ఏటా ఉద్యోగులు పదవీ విరమణ కారణంగా 30 శాతం వరకు ఉద్యోగుల సంఖ్య తగ్గింది. కొన్ని చోట్ల తాత్కాలిక కండక్టర్లను తీసుకోవడం, కొన్ని రూట్లలో డ్రైవర్లకే కండక్టర్ల బాధ్యతలు అప్పగిస్తున్నారు.
దీంతో ఉన్న ఉద్యోగులపై పని భారం పడటంతో.. కొత్తగా నియామకాలు చేపట్టాలని ఆర్టీసీ భావిస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. కండక్టర్‌తో పాటు డ్రైవర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఆర్టీసీలో డ్రైవర్లు సహా మొత్తం 11 డిపార్ట్‌మెంట్లతో కలిసి 3,035 పోస్టుల భర్తీకి ఏడాది కిందటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. అయితే ఈ పోస్టులతో పాటు కండక్టర్ పోస్టులను భర్తీ చేస్తారా? లేదా విడి విడిగా భర్తీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.