ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు లేవని, పలు చోట్ల ప్రజలు ఆందోళన చేస్తుండటంపై ఆయన స్పందించారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిత్యం కొనసాగుతుందని, గ్రామ సభలు ముగిసినా కూడా కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత రేషన్ కార్డులు ఉన్న వారికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు మంత్రి ప్రకటన చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయని, పదేళ బీఆర్ఎస్ పాలనలో 40 వేల రేషన్ కార్డులే ఇచ్చారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. రేషన్ కార్డుల జారీపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఇక అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లనూ కేటాయిస్తామన్నారు.