ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి: సీఎం రేవంత్
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 27 Sept 2024 9:05 AM ISTప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి: సీఎం రేవంత్
హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశా నిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొన్నం ప్రభాకర్, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించి పలు సూచనలు చేశారు.
సీఎం మాట్లాడుతూ.. ఇప్పటికే 75 శాతం, అంతకు మించి పనులు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్‌లోగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశముందన్నారు. అటు గోదావరి బేసిన్, ఇటు కృష్ణా బేసిన్‌లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించే ప్రాజెక్టులకు గ్రీన్ చానల్ ద్వారా బిల్లుల చెల్లింపులు జరగాలన్నారు. కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం ముందుగా భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని, అందుకు రెవిన్యూ విభాగంతో సమన్వయం చేసుకోవాలన్నారు.
భూసేకరణలో మానవీయత ఉండాలని, భూములు ఇచ్చే వారితో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంప్రదింపులు జరపాలన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పరిధిలో పేరుకుపోయిన పూడిక తీతపై ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నవిధానాలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలిచ్చారు.