పౌరుల హక్కులను పరిరక్షించడమే మానవ హక్కుల కమిషన్ బాధ్యతని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్ జస్టిస్ గూడ చంద్రయ్య వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో పర్యటించిన హెచ్ఆర్సీ ఛైర్ పర్సన్.. పెండింగ్‌లోని ఫిర్యాదులపై జిల్లా రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్షించారు. కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు రెండు బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు.
మానవ హక్కుల ఉల్లంఘనలు జరగకుండా వివిధ స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది రాజ్యాంగబద్ధంగా పని చేయాలని ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో మానవ హక్కుల చట్టాలకు సంబంధించిన మాన్యూవల్స్ అందుబాటులో ఉంచుకోవాలని జస్టిస్ గూడ చంద్రయ్య సూచించారు.
బాధితులు కమిషన్‌కి రావాల్సిన అవసరం లేదని.. పోస్టులో పంపినా స్పందించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. జిల్లాలో మానవ హక్కుల కమిషన్‌కు సంబంధించి 24 కేసులు ఉండగా.. 11 కేసులపై నివేదిక అందజేశామని జిల్లా అదనపు కలెక్టర్ సీతా రామారావు వెల్లడించారు. వాటిలో 7 పోలీస్ అధికారులకు సంబంధించినవి కాగా.. మిగతావి వైద్య ఆరోగ్య శాఖవని అదనపు కలెక్టర్ తెలిపారు.