హైదరాబాద్: కమర్షియల్ టాక్స్ శాఖలో 4.7%, మైన్స్ శాఖలో 18.6 శాతం పెరుగుదల కనిపిస్తున్నది ఇతర శాఖల్లో ఆదాయ సమీకరణలో వెనుకబాటు కనిపిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సచివాలయంలో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ సబ్ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కమిటీ సభ్యులు, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ పూడిక తీత పనులతో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుంది, ఇసుక ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందనీ మంత్రి ఉత్తమ్ వివరించారు.
మొదట ఒక ప్రాజెక్టులో పూడికతీత కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకం పనులను పూర్తిగా ట్రైబల్ ఏజెన్సీల ద్వారా నిర్వహించాలని మంత్రులు సూచించారు. గిరిజనులకు యంత్ర సామాగ్రి అందుబాటులో ఉండదు ఈ నేపథ్యంలో ఐటీడీఏలోని ఇంజనీరింగ్ విభాగం యంత్ర సామాగ్రి సహాయం అందించాలని మంత్రులు సూచించారు. దీని ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమల తరలింపునకు మూడు వారాల్లో విధి విధానాలు రూపొందించాలని మంత్రులు సంబంధిత అధికారులను ఆదేశించారు.