టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 2 లక్షల ఖాళీలు భర్తీ చేస్తాం: సీఎం రేవంత్

టీఎస్‌పీఎస్‌సీ ద్వారా తమ ప్రభుత్వం ఈ ఏడాది చివరిలోపు రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి జనవరి 31 బుధవారం నాడు పునరుద్ఘాటించారు.

By అంజి  Published on  1 Feb 2024 9:24 AM IST
2 lakh vacancies,TSPSC, Telangana, CM Revanth

టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 2 లక్షల ఖాళీలు భర్తీ చేస్తాం: సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా తమ ప్రభుత్వం ఈ ఏడాది చివరిలోపు రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జనవరి 31 బుధవారం నాడు పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసి, పోలీస్ శాఖలో 15 వేల ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ పునరుద్ధరణలో భాగంగా, ఇటీవల కొత్త ఛైర్మన్, సభ్యులను నియమించారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఏదీ ఆపలేమని, ఈ ఏడాది చివరిలోపు రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.

మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) వివిధ విభాగాలలో పోస్ట్ చేయబడిన నర్సులను నియమించింది. ఎంపికైన స్టాఫ్ నర్సుల్లో 80% కంటే ఎక్కువ మంది మహిళలే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. స్టాఫ్ నర్సుల నియామకం చాలా కాలంగా పెండింగ్‌లో ఉందన్నారు. విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ ఆవిర్భవించిందని, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించి పేదల కన్నీళ్లు తుడిచివేస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర ఏర్పాటులో యువత కీలకపాత్ర పోషించినప్పటికీ గత దశాబ్ద కాలంగా వారి ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.

గత ప్రభుత్వ హయాంలో దళారులు తమ కుటుంబ సభ్యులకు మాత్రమే పట్టం కట్టారని, నిరుద్యోగ యువతకు న్యాయం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన యువకులపై కేసులు పెట్టి వేధించారని అన్నారు. మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావును విమర్శిస్తూ.. ప్రజలు కేసీఆర్‌ కుమార్తెను ఓడించిన వెంటనే ఎమ్మెల్సీ చేశారని రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి ఉద్యోగాల గురించి కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు.

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఏకంగా 7 వేల మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసిందన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో 5 వేల ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు.

Next Story