తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లోని స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం.. అటు తెలంగాణలోని ఆదిలాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. కామారెడ్డి జిల్లా మద్నూర్, డోంగ్లీ మండలాలకూ సెలవు ప్రకటించారు. కాగా వర్షాల నేపథ్యంలో అవసరం అయితే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అటు ఏపీలోని అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.
అటు భారీ వర్షాలు కొనసాగితే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అల్పపీడనం వాయుగుండగా మారుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సీఎస్‌కు సూచించారు. ఉత్తరాంధ్రలో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం, కొంత ప్రాంతాలు కోతలకు గురికావడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.