Cold Wave Alert: తెలంగాణలో ఇవాళ, రేపు జాగ్రత్త..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది

By -  Knakam Karthik
Published on : 29 Dec 2025 7:47 AM IST

Telangana, Cold wave, cold intensity, Cold Wave Alert, Cold waves, Temperatures Dropping

Cold Wave Alert: తెలంగాణలో ఇవాళ, రేపు జాగ్రత్త..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధరణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది.

దీంతో ఆదిలాబాద్‌, కుమ్రంభీంఆసిఫాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, వికారాబాద్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌, హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, జగిత్యాల, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, జయశంకర్‌భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. గత 24 గంటల్లో కుమ్రంభీంఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత 7.1 డిగ్రీలుగా నమోదైనట్టు వెల్లడించింది. ఇక పెరుగుతున్న చలి దృష్ట్యా ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు...చలికి తట్టుకునేలా జాగ్రత్తలు పాటించాలని, తెల్లవారుజాము, రాత్రి వేళల్లో అవసరం అయితేనే బయటకు రావాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవే జాగ్రత్తలు...

ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు ఉన్ని దుస్తులు, మఫ్లర్లు, చేతి గ్లౌజులు ధరించాలని సూచిస్తున్నారు. రెండు మూడు పొరల దుస్తులు ధరించడం వల్ల శరీర వేడి బయటకు పోకుండా ఉంటుంది అని తెలిపింది. మంకీ క్యాప్ లేదా స్కాఫ్ ధరించాలని సూచిస్తుంది.వృద్ధులు, చిన్నారులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి మరింత జాగ్రత్త అవసరం అని సూచిస్తోంది. చలికాలంలో దాహం తక్కువగా వేసినప్పటికీ...శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి గోరువెచ్చని నీటిని తగినంతగా తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి అని సూచిస్తున్నారు.మరోవైపు వేడి వేడి ఆహారం తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా ఉన్నవారు తెల్లవారుజామున మంచు కురిసే సమయంలో బయటకు రాకపోవడం మంచిది. రాత్రిపూట గదుల్లో గాలి వెలుతురు ఉండేలా చూసుకుంటూ, కిటికీలకు పరదాలు వాడి చల్లటి గాలిని నియంత్రించాలి అని వాతావరణ శాఖ సూచించింది.

Next Story