హైదరాబాద్: రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్స్ ను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడేషన్ పనులపై ముఖ్యమంత్రి కార్మిక శాఖ ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో రూపుదిద్దుకుంటున్న ఏటీసీలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒకటి ఉండేలా చూడాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాలని చేయాలని, ఐటీఐలు లేని కేంద్రాల్లో కొత్తగా ఏటీసీలను ఏర్పాటు చేయాలని చెప్పారు.
నియోజకవర్గ కేంద్రాల్లో లేదా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏటీసీల్లో అవసరమైన సిబ్బంది ఇతర వివరాలను అధికారులు వివరించగా, సిబ్బంది నియామకాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఏటీసీల ఏర్పాటుకు అవసరమైన నిధులను వెంటనే అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అలాగే గిగ్, ఫ్లాట్ ఫామ్ వర్కర్స్ యాక్ట్ విషయంలో పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా కార్మిక శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.