హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో జరిగిన సమావేశం మేరకు, మెట్రో ఫేజ్-II కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేపడుతోందని తెలియజేస్తూ ముఖ్యమంత్రి.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇద్దరు అధికారులతో కూడిన ఒక సంయుక్త కమిటీలో చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు అధికారులను నామినేట్ చేసేందుకు వేచి చూస్తోందని కిషన్ రెడ్డి జనవరి 15 వ తేదీన రాసిన లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ, దానికి సంబంధించిన వివరాలను కూడా ముఖ్యమంత్రి తన లేఖలో తెలియజేశారు.
కమిటీ కూర్పునకు సంబంధించిన వివరాలను ఇప్పటికే కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. మెట్రో రైల్ ఫేజ్-II మంజూరు కోసం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫేజ్-II ప్రాజెక్టును తన పలుకుబడిని ఉపయోగించి వీలైనంత తొందరగా ఆమోదింపజేయాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖలో కోరారు.