Telangana: రైతు రుణమాఫీ అమలుపై సీఎం రేవంత్ శుభవార్త

రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి అధికారులకు ఆగస్టు 15 వరకు గడువు విధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

By అంజి  Published on  11 Jun 2024 7:17 AM IST
CM Revanth, authorities, farmer loan waiver, Telangana

Telangana: రైతు రుణమాఫీ అమలుపై సీఎం రేవంత్ శుభవార్త

హైదరాబాద్: రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి అధికారులకు ఆగస్టు 15 వరకు గడువు విధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రుణమాఫీ తదితర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాగంగా రైతు రుణమాఫీ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం కోరారు. 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను మాత్రమే గుర్తించాలని రేవంత్ రెడ్డి అన్నారు. కటాఫ్ తేదీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. రుణమాఫీ పథకం అమలుకు ముందు పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు) నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు రైతులకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అవసరమైన నిధుల అంచనాను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

రుణమాఫీ అమలుకు సంబంధించి స్పష్టమైన ప్రణాళికతో రావాలని, విధివిధానాలను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగస్టు 15లోగా పంట రుణాలను మాఫీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతు రుణమాఫీ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story