Telangana: స్కూళ్లకు సెలవులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
వర్షాలు, వరదల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులపై జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
By అంజి Published on 2 Sept 2024 11:38 AMTelangana: స్కూళ్లకు సెలవులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్: వర్షాలు, వరదల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులపై జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసినట్టు తెలిపారు. కేంద్రం తక్షణమే రూ.2 వేల కోట్లు కేటాయించాలని కోరారు. అందుకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలన్నారు. వరద ప్రభావిత జిల్లాలైన సూర్యాపేట, మహబూబాబాద్‌కు తక్షణ సాయంగా రూ.5 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నామన్నారు.
అటు రాష్ట్రంలో వరదలపై బీఆర్‌ఎస్ బురద రాజకీయం చేస్తోందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఒకాయన ఫాంహౌస్‌లో ఉంటే.. ఇంకొకాయన అమెరికాలో ఉండి ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. బెయిల్ కోసం 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్తారు కానీ వరద బాధితులను పరామర్శించరా అని ప్రశ్నించారు. మూడు రోజులుగా తాను నిద్ర లేకుండా సమీక్ష నిర్వహిస్తున్నానని, మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని వెల్లడించారు.
సీఎం రేవంత్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. పాలేరులోని నాయకన్‌గూడెంలో వరదలకు దెబ్బతిన్న రోడ్డును ఆయన పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానికులతో ఆయన మాట్లాడే అవకాశం ఉంది.