నేను మాట్లాడింది తప్పా?. కేసీఆర్ అందుకే సెక్యూరిటీ పెట్టుకున్నారు: సీఎం రేవంత్
మాజీ సీఎం కేసీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభలో నిరసన చేపట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
By అంజి Published on 15 March 2025 1:41 PM IST
నేను మాట్లాడింది తప్పా?. కేసీఆర్ అందుకే సెక్యూరిటీ పెట్టుకున్నారు: సీఎం రేవంత్
మాజీ సీఎం కేసీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభలో నిరసన చేపట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 'బీఆర్‌ఎస్ ఒకప్పుడు అధికారంలో ఉండే, తర్వాత ప్రతిపక్షానికి పడిపోయింది. అనంతరం 8 ఎంపీ సీట్లు కోల్పోయి గుండు సున్నాకు పడిపోయి మార్చురీకి వెళ్లిందని అన్నా. నేను మాట్లాడింది తప్పా.. కానీ తాను కేసీఆర్‌ను అన్నట్టు హరీశ్ రావు, కేటీఆర్ చిత్రీకరిస్తున్నారు. అలాంటి స్వభావం నాది కాదు' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణకు అన్యాయం జరిగేలా ఏపీ నిర్ణయాలు తీసుకుంటే.. అడ్డుకోవాల్సింది పోయి రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిని వచ్చిందెవరని కేసీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్లు వేశారు. ఇప్పటి వరకు ఆయన జీతంగా రూ.57 లక్షలల ప్రభుత్వ సొమ్ము తీసుకుని, రెండుసార్లే అసెంబ్లీ వచ్చారన్నారు. తమ ఎమ్మెల్యేలను రేబిస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టు తయారు చేశారని అన్నారు. కుటుంబీకుల వల్ల ఆయనకు ప్రాణహాని ఉంది కాబట్టే సెక్యూరిటీ పెట్టుకున్నారని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ ఆలోచనలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలనే గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. ఏ ప్రభుత్వం అయినా ఇదే చేస్తుందన్నారు. ఇది బీఆర్‌ఎస్ సభ్యులకు కూడా తెలుసునన్నారు. అయినా గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో కార్యకర్త ప్రసంగంలా ఉందని అవహేళన చేశారని, గతంలో మహిళా గవర్నర్‌ను అవమానించిన చరిత్ర వారిదని సీఎం రేవంత్ విమర్శించారు. మరోవైపు కేసీఆర్‌పై సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.