నిరుద్యోగ యువతీ యువకులకు సీఎం రేవంత్ శుభవార్త
నిరుపేదలకు కడుపునిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిరుద్యోగ యువతీ యువకులకు మరో శుభవార్త చెప్పారు.
By అంజి
నిరుద్యోగ యువతీ యువకులకు సీఎం రేవంత్ శుభవార్త
నిరుపేదలకు కడుపునిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిరుద్యోగ యువతీ యువకులకు మరో శుభవార్త చెప్పారు. రైతులు, మహిళలు, యువత సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల కాలం పూర్తి చేసుకునే లోపు మొత్తం 1 లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తుందని ప్రకటించారు. అధికారం చేపట్టిన ఏడాది కాలంలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలం పూర్తయ్యేలోగా మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల కుటుంబాలు ఆత్మగౌరవంతో బతికే విధంగా వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తుందని భరోసానిచ్చారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు.
అశేషంగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ''పోరాటాల ఈ గడ్డ నుంచి తెలంగాణ పేద ప్రజలకు రేషన్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉంది. భూమి కోసం భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు సాగించిన గడ్డ ఇది. రావి నారాయణరెడ్డి అత్యధిక మెజారిటీని ఇచ్చి దేశానికే సాయుధ రైతాంగ పోరాట శక్తిని చాటిచెప్పిన ప్రాంతం. ఈ జిల్లా చరిత్రనే తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరినట్టుగా, తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ప్యాకేజీ 6 నుంచి గోదావరి జలాలను తరలించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వరకు ప్రభుత్వం విశ్రమించదని మాట ఇస్తున్నా'' అని అన్నారు.
''హుజూర్‌నగర్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి, ఇప్పుడు తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టాం. గడిచిన పదేళ్లలో పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన చేయలేదు. ఈరోజు రేషన్ షాపుల వద్ద క్యూలైన్లలో నిలబడి కోట్లాది మంది సన్నబియ్యం తీసుకుంటున్నరు. వ్యవసాయం దండగ కాదు. పండుగ చేయాలన్న లక్ష్యంతోనే రైతాంగానికి అండగా నిలవాలని 21 వేల కోట్ల రూపాయలతో 25,55,968 లక్షల మందికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేశాం. పంటలకు కనీస మద్దతు ధరతో పాటు సన్నవడ్లు పండిస్తే రూ.500 బోనస్ చెల్లిస్తున్నాం.
1.49 లక్షల ఎకరాలకు 70 లక్షల మంది రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్ల మేరకు రైతు భరోసా వేయడం ద్వారా వారి కళ్లల్లో ఆనందం చూసినం. పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పాం. దాంతో ఏడాది తిరిగేలోపు 2.85 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశంలోనే రికార్డు సాధించాం. రైతు భరోసా, రుణమాఫీ, కనీస మద్దతు ధర, రేషన్ కార్డు కావొచ్చు.. రైతులు సంతోసంగా ఉన్నప్పుడు తెలంగాణ ఒక పండుగ జరుపుకుంటుంది. రేషన్ కార్డులలో దాదాపు 26 లక్షల మందికి పేర్లు మార్చుకునే అవకాశం ఇచ్చాం. పేదవాడి ఆత్మగౌరవం, ఆకలి తీర్చే ఆయుధంగా పనిచేస్తుందని ఆలోచన చేసి లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరే విధంగా రేషన్ కార్డులను జారీ చేస్తున్నాం.
రాష్ట్రంలోని 67 లక్షల స్వయం సహాయక సంఘాల ఆడబిడ్డలకు పండుగ పూట ప్రతి ఆడబిడ్డకు రెండు చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించాం. జీరో వడ్డీతో 21 వేల కోట్ల మేరకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తున్నాం. ఆర్టీసీలో ఆడబిడ్డకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు మహిళా సంఘాలకు వెయ్యి బస్సులిచ్చి కిరాయికి ఇచ్చే విధంగా అవకాశం ఇచ్చాం. 200 యూనిట్ ఉచితంగా ఇవ్వడమే కాకుండా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఆడబిడ్డలకు ఇస్తున్నాం. అలాగే జిల్లా కేంద్రాల్లో స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంక్ లు నడిపించే బాధ్యత ఇచ్చాం. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో వాటిని నిర్వహించే బాధ్యత ఇచ్చాం. దేశంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో కులగణన పూర్తి చేయడం ద్వారా వచ్చే జనగణనలో కులగణన చేసే విధంగా ఒత్తిడి తెచ్చి తలొగ్గే విధంగా చేయగలిగాం. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం..'' అని వివరించారు. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేషన్ కార్డులను పంపిణీ చేశారు.