2 లక్షల ఉద్యోగాల భర్తీపై రేవంత్‌ ప్రకటన

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు.

By అంజి  Published on  17 Dec 2023 1:19 AM GMT
CM Revanth, 2 lakh jobs, Telangana

2 లక్షల ఉద్యోగాల భర్తీపై రేవంత్‌ ప్రకటన

తెలంగాణ సీఎం పదవి చేపట్టిన రోజు నుండి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆలోచనలు చేస్తూనే పాలనపరంగా ప్రక్షాళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలు చేసినా ఉద్యోగాలు రాక.. తెలంగాణ యువతకు తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్‌ రెడ్డి శాసనమండలిలో వెల్లడించారు. టీఎస్‌పీఎస్‌సీ కమిషన్‌ ఏర్పాటు లోపభూయిష్టంగా ఉందని హైకోర్టు మొదట్లోనే చెప్పిందన్నారు. అర్హతలేని వారిని నియమించారని అన్నారు.

త్వరలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. మెగా డీఎస్‌సీ నిర్వహించి ప్రభుత్వ విద్యా ప్రమాణాలు పెంచుతాం అని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో చాలా రోజులుగా ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ తక్కువ పోస్టులతో ప్రకటన చేయటంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి.. మెగా డీఎస్సీ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటన చేయడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story