Telangana: పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌ అమెరికా టూర్‌

పెట్టుబడులు తీసుకురావడం, వ్యూహత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ అనుముల అమెరికా పర్యటన ప్రారంభమైందని తెలంగాణ సీఎంవో ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొంది.

By అంజి
Published on : 4 Aug 2024 9:15 AM

CM Revanth, America tour,investments, Telangana

Telangana: పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌ అమెరికా టూర్‌

తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడం, వ్యూహత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ అనుముల అమెరికా పర్యటన ప్రారంభమైందని తెలంగాణ సీఎంవో ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొంది. న్యూయార్క్ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి బృందానికి ఘన స్వాగతం లభించిందని, అమెరికాతోపాటు దక్షిణ కొరియాలోనూ వారు పర్యటిస్తారని తెలిపింది.

"కీలకమైన న్యూయర్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను. ప్రవాస భారతీయులైన ఇక్కడి మన తెలుగు సోదర సోదరీమణులు గుండెల నిండా ప్రేమ, ఆప్యాయతలతో మాకు స్వాగతం పలకడానికి విచ్చేశారు. మనందరినీ ఏకం చేసే ఒక కల.. తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకోవడం" అని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

న్యూయార్క్‌ నగరం నుంచి మొదలైన ఈ పెట్టుబడుల సాధన పర్యటనలో రాబోయే 10 రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియాలోని వివిధ నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి నాయకత్వంలోని బృందంలో పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌, పలువురు ఉన్నతాధికారులు భాగమవుతారు.

Next Story