Telangana: దివ్యాంగులకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల అమలు

దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు.

By అంజి  Published on  3 March 2024 8:03 AM IST
CM Revanth,  reservation, education,jobs, disabled people

Telangana: దివ్యాంగులకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల అమలు

దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు. చట్ట ప్రకారం ఉద్యోగాల్లో 4 శాతం, విద్యావకాశాల్లో 5 శాతం, అన్ని పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఫైలు సిద్ధం చేసి పంపించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని చెప్పారు.

ట్రాన్స్ జెండర్లకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్లోనే వారికి చికిత్సలు చేస్తున్నారనే చర్చ జరిగింది. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ అన్నిట్లో ట్రాన్స్ జెండర్లకు వైద్య చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పథకాలన్నీ వారికి వర్తించేలా, వారికి సరైన అవకాశాలు కల్పించేందుకు, సంక్షేమానికి వీలుగా ప్రత్యేక విధానాన్ని తయారు చేయాల్సి ఉందని అన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఎన్హెచ్ఎఫ్ఎస్ వెల్లడించిన గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. ఆరోగ్య ప్రమాణాలు పెరగాల్సింది పోయి, దిగజారటం సరైంది కాదని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అసలైన లబ్ధిదారులకు అందుతుందా.. లేదా పక్కాగా అధికారులు పర్యవేక్షించాలని సీఎం సూచించారు.

Next Story