తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన బీజీబిజీగా కొనసాగుతోంది. హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. అరగంట పాటు సాగిన ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరినట్లుగా సమాచారం.
దాదాపు అరగంట పాటు కొనసాగిన చర్చల్లో 2014-15 గాను సేకరించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యం బకాయిలురూ. 343.27 కోట్లు విడుదల చేయడంతోపాటు సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కోరారు.
రాష్ట్రంలో గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరగలేదు. ఈ క్రమంలోనే కార్డుల జారీకి రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఎన్నికల కోడ్ ముగియనుండటంతో దీనిపై ముందడుగు వేయాలని భావిస్తోంది. ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకువెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కోటా పెంచాలని సీఎం విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.