తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపనలు జరగనున్నాయి. దసరా పండుగ శుభసందర్భాన్ని పురస్కరించుకుని నేడు (11 వ తేదీన) రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు చేస్తుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మధిర నియోజకవర్గంలో జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో విశాలమైన క్యాంపస్‌లో ఈ స్కూళ్లను నిర్మించాలని సంకల్పించగా, మొదటి విడతలో 28 చోట్ల చేపడుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సామాజిక అంతరాలు లేని విద్యను అందించాలన్న లక్ష్యంతో చేపడుతున్న ఈ క్యాంపస్‌లలో అన్ని రకాలైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేయబోయే ఈ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు 5 వేల కోట్ల రూపాయలు వెచ్చించనుంది.