హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి , రాష్ట్రానికి జరిగిన అపార నష్టాన్ని పరిష్కరించేందుకు అవసరమైన సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సోమవారం కేంద్రాన్ని కోరారు. బాధిత ప్రాంతాలను స్వయంగా సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. వరద నష్టంపై సవివరమైన నివేదికను కేంద్రానికి అందజేయాలని, తక్షణ సహాయం కోసం అధికారిక అభ్యర్థనను అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
సహాయ కార్యక్రమాల కోసం ప్రతి కలెక్టరేట్‌లో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వరదలపై సమీక్షా సమావేశం అనంతరం జిల్లా పరిస్థితిని అంచనా వేసేందుకు రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో ఖమ్మం బయలుదేరి వెళ్లారు. ఇవాళ సీఎం ఖమ్మంలో పర్యటించి రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా మరో 4 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.