ప్రతి నెలా 10వ తేదీలోగా నిధుల చెల్లింపు: సీఎం రేవంత్
చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం.. కామన్ డైట్‌ను ఆవిష్కరించారు.
By అంజి Published on 15 Dec 2024 2:32 AM GMTప్రతి నెలా 10వ తేదీలోగా నిధుల చెల్లింపు: సీఎం రేవంత్
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పిల్లల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చును తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారిని భాగస్వాములుగా, భవిష్యత్తు తరాలను నిర్మించడానికి పెడుతున్న పెట్టుబడిగా మాత్రమే చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం.. కామన్ డైట్‌ను ఆవిష్కరించారు. పలువురు విద్యార్థులతో మాట్లాడించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధికారులతో కలిసి అక్కడే భోజనం చేశారు.
అంతకముందు జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ పాఠశాలల ప్రమాణాలను పెంచాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రైవేటు విద్యా సంస్థలతో పోల్చితే ప్రభుత్వ స్కూళ్లల్లో క్వాలిఫైడ్ టీచర్లు, మంచి వసతులు, మంచి జీతాలు ఉన్నా, ఎందుకు ప్రమాణాలు పెంచలేకపోతున్నామో ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 లక్షల మంది చదువుతుంటే, 11 వేల ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో టాలెంట్ ఎక్కువగా ఉంటుందని, ప్రభుత్వ స్కూళ్లలో తక్కువగా ఉంటదన్న అపోహను తొలగించాల్సిన అవసరం ఉంది. ఈ స్కూళ్లల్లో చదువుతున్న వారు అనాథలు కాదు. వాళ్లు రాష్ట్ర సంపద అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సీఎం అన్నారు.
''8 ఏళ్ళ నుంచి డైట్ చార్జీలను పెంచలేదు. 16 ఏండ్లుగా కాస్మొటిక్ చార్జీలను పెంచలేదు. ప్రజా ప్రభుత్వం అన్నీ పరిశీలించి 40 శాతం మేరకు డైట్ చార్జీలను 212 శాతం కాస్మొటిక్ చార్జీలను పెంచాం. గతంలో ఆరు నెల్లకో సంవత్సరానికో ఒకసారి నిధులు విడుదల చేసే వారు. ఇప్పుడు ప్రతి నెలా 10 వ తేదీలోగా గ్రీన్ చానెల్ ద్వారా నిధులు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా రెసిడెన్షియల్ స్కూళ్లను పరిశీలిస్తా. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు'' అని సీఎం రేవంత్ హెచ్చరించారు.
విద్యార్థులతో మెస్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసి వారిని భాగస్వాములను చేయడం ద్వారా వారికి అవసరమైన ఆహారాన్ని వారే ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రతిసారీ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టడం కాకుండా ఎంతో ముందుగానే పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. స్కూల్ యూనిఫామ్ బాధ్యతను రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగించాం. కుట్టు పనికి ఇచ్చే రుసుమును కూడా రూ.25 నుంచి రూ.75 కు పెంచాం. స్కూళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాం. వారంలో రెండు మూడు రోజులు రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించామని సీఎం రేవంత్ చెప్పారు.