తులసి వనంలో గంజాయి మొక్కకు చోటు లేదు.. ఖమ్మం జిల్లాలో బీజేపీకి చోటు లేదు
సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
By - Medi Samrat |
సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల హక్కుల పోరాటాల్లో ప్రాణాలు కోల్పోతారేమే కానీ ఎర్ర జెండా వదలమని ప్రకటించిన కామ్రేడ్లకు వందనం.. రైతులు, రైతు కూలీలు, హరిజనులు, గిరిజనులు కోసం కమ్యూనిస్టులు పోరాడారన్నారు. దున్నే వాడిదే భూమి అని కమ్యూనిస్టులు పిలుపునిస్తే.. దానిని అమల్లోకి తెచ్చింది ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు అని గుర్తుచేశారు. రైతులు ధర నిర్ణయించలేనప్పుడు కనీస మద్దతు ధర కోసం కమ్యూనిస్టులు పోరాడారన్నారు.
4 వేల అమర వీరుల త్యాగాలతో హైదరాబాద్ రాష్ట్రం నిజాం నుంచి విముక్తి అయ్యిందని.. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, శేషగిరి రావు వంటి వారెందరో నాడు పోరాడారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. BJP అంటే బ్రిటిష్ జనతా పార్టీ.. కాంగ్రెస్… కమ్యూనిస్టులు కలిసి ఉపాధి హామీ పథకం తెస్తే బీజేపీ ప్రభుత్వం దానిని రద్దు చేసిందని మండిపడ్డారు. ఉపాధి హామీ రద్దుతో అగ్గువకో సగ్గువకో అదానీ, అంబానీలకు కూలీలు దొరికే పరిస్థితి.. బ్రిటీషర్లకు వ్యతిరేఖంగా నాడు పోరాటం చేశాం.. పేదల హక్కులు కొల్లగొట్టడానికి, రాజ్యాంగం మార్చడానికి 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారని దుయ్యబట్టారు.. రాజ్యాంగాన్ని చెర పట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. పేదల ఓటు హక్కు రద్దు చేసేందుకు SIR తీసుకువచ్చారన్నారు. రాజ్యాంగ సభ సమయంలోనూ గోల్వాల్కర్ వారసులు పేదలకు ఓటు హక్కు లేకుండా చేసేందుకు ప్రయత్నించారన్నారు. మూల వాసులు ఎక్కడ నుంచి ఆధారాలు తెస్తారు.. ఓటు హక్కు లేకపోతే రేషన్ కార్డు, ఇల్లు, పింఛన్ పోతుందన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ తేడా లేకుండా మోదీకి వ్యతిరేకంగా దండు కట్టాలని పిలుపునిచ్చారు.
కమ్యూనిస్టులు పేదల కోసం కొట్లాడతారు.. నేటి ఈ ప్రభుత్వంలో మీ శ్రమ ఉందన్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి వచ్చినా బీజేపీకి ఒక్క సీటు లేదు.. తులసి వనంలో గంజాయి మొక్కకు చోటు లేదు.. ఖమ్మం జిల్లాలో బీజేపీకి చోటు లేదన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి సర్పంచులు కూడా లేరన్నారు.