హైదరాబాద్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమర పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రతినిత్యం ప్రజల రక్షణ కోసం, కర్తవ్యదీక్షలో ప్రాణ త్యాగాలు చేసిన యోధుల సేవలు ఎంతో స్ఫూర్తి దాయకమని, వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొన్నారు.
గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. శాంతి భద్రతలు కాపాడటంలో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని అన్నారు. ప్రజల కోసం రక్తం అర్పించిన పోలీసు వీరులు ఎందరో ఉన్నారని, విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు తెలిపారు. 1959 అక్టోబర్ 21న భారత్, చైనా సరిహద్దుల్లో 10 మంది జవాన్లు వీరమరణం పొందారని, అప్పటి నుండి ప్రతి ఏటా ఈ రోజు పోలీసు అమరవీరులను స్మరించుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
శాంతి భద్రతలు లేకుంటే అభివృద్ధి ఉండదని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కృషి చేస్తున్నారని డీజీపీ పేర్కొన్నారు.