పీఎం కుసుమ్ పథకం.. పర్మిషన్‌ పునరుద్ధరించాలని కేంద్రానికి సీఎం రేవంత్‌ రిక్వెస్ట్

తెలంగాణ రాష్ట్రానికి పీఎం కుసుమ్ పథకం కింద గ‌తంలో ఇచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్ప‌త్తికి అనుమ‌తుల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

By అంజి  Published on  5 March 2025 6:59 AM IST
CM Revanth, central government, PM Kusum scheme

పీఎం కుసుమ్ పథకం.. పర్మిషన్‌ పునరుద్ధరించాలని కేంద్రానికి సీఎం రేవంత్‌ రిక్వెస్ట్

తెలంగాణ రాష్ట్రానికి పీఎం కుసుమ్ పథకం కింద గ‌తంలో ఇచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్ప‌త్తికి అనుమ‌తుల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని కేంద్ర ఆహార పౌర సరఫరాలు, పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ‌కు గ‌తంలో 4 వేల మెగావాట్లకు అనుమ‌తులు ఇచ్చిన కేంద్రం, త‌ర్వాత దానిని వెయ్యి మెగావాట్ల‌కు కుదించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.

తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సోలాల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర మంత్రికి వివరించి, గతంలో మంజూరు చేసిన 4 వేల మెగావాట్ల ఉత్పత్తి అనుమతులను పునరుద్ధరించాలని కోరారు.

ముఖ్య‌మంత్రి, రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డిలు.. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీని కలిసి రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలను వివరించారు. భార‌త ఆహార సంస్థకు 2014-15 ఖ‌రీఫ్ కాలంలో స‌ర‌ఫ‌రా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణ‌కు బ‌కాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరారు. అప్పట్లో అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వమే భ‌రించింద‌ని, వాటిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని విజ్ఞప్తి చేశారు.

ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న కింద మే 2021 నుంచి మార్చి 2022 వర‌కు స‌ర‌ఫ‌రా చేసిన అద‌న‌పు బియ్యం, 2022 ఏప్రిల్ నెల‌లో స‌ర‌ఫ‌రా చేసిన బియ్యానికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను ధ్రువీక‌రించుకుని అందుకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలని చెప్పారు. జూన్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వ‌ర‌కు నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బ‌కాయిలు రూ.79.09 కోట్లను కూడా వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరారు. ఈ విషయాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

Next Story