హైదరాబాద్: రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉగాది పండుగ నాటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలనే ఓ స్పష్టమైన లక్ష్యంతో రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డు నమూనాను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఫైనల్ చేశారు. లేత నీలి రంగులో ఈ కొత్త రేషన్ కార్డును తయారు చేయాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. రేషన్ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉండే విధంగా రేషన్ కార్డు నమూనాని ఖారారు చేశారు.
కొత్త రేషన్ కార్డు.. లేత నీలం రంగులో పోస్టు కార్డు కంటే కాస్త తక్కువ సైజులో ఉంటుంది. దీనిపై కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలతో పాటు అదనంగా ఓ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఈ మేరకు కార్డుల జారీకి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు సమాచారం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికే కాదు.. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుదారులకూ ఈ కొత్త కార్డులను జారీ చేయనున్నారు. ఈ దిశగా పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89,95,282 రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డులు, కొత్తగా సభ్యులను చేర్చడానికి మరో 18 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే వీటి పరిశీలన పూర్తయింది. పాతవి, కొత్తవి కలిపి మొత్తం కోటి రేషన్ కార్డులను ప్రభుత్వం కొత్తగా అందించనుంది.