పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నెలకు రూ.25వేల పెన్షన్: సీఎం రేవంత్

హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.

By Srikanth Gundamalla
Published on : 4 Feb 2024 2:54 PM IST

cm revanth reddy, telangana govt,  chiranjeevi, venkaiah naidu,

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నెలకు రూ.25వేల పెన్షన్: సీఎం రేవంత్

హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగస్టార్ చిరంజీవిలను సీఎం రేవంత్ రెడ్డి శాలువా, మెమెంటోలతో సత్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ఒక్కొక్కరికి రూ.25లక్షల చొప్పున అందజేస్తామని చెప్పారు. అంతేకాదు.. వారికి ప్రతినెలా రూ.25వేల చొప్పున పెన్షన్ కూడా ఇస్తామని చెప్పారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ వెళ్లే ప్రతి తెలుగు రాజకీయ నేతకు వెంకయ్య నాయుడు పెద్దదిక్కు అని పొగిడారు సీఎం రేవంత్. ఆయన్ని సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి పున్నమినాగు సినిమాలో ఏస్థాయిలో నటించారో.. ఇటీవల వచ్చిన సైరాలోనూ అదే నటనన కనబర్చారని చెప్పారు. అయితే.. ఈ పురస్కారం కార్యక్రమం రాజకీయాలకు అతీతమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజల కోసం తపించే వ్యక్తి వెంకయ్య నాయుడు అనీ.. ఆయన రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన వెంకయ్య నాయుడు.. అవార్డులు, సన్మానాలను తన జీవితంలో పెద్దగా తీసుకోలేదని అన్నారు. పద్మవిభూషణ్ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే.. ప్రధాని మోదీపై ఉన్న గౌరవంతో అంగీకరించినట్లు చెప్పారు. ఇక పద్మ పురస్కారాలు అందుకున్న వారికి సన్మానం చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డిని అభినందిస్తున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పారు. మట్టిలో మాణిక్యాలకు ఈ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయనీ.. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

Next Story