మెగా డీఎస్సీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తాము ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
By Srikanth Gundamalla Published on 31 Dec 2023 4:53 AM GMTమెగా డీఎస్సీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తాము ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలు కోసం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. మరోవైపు నిరుద్యోగుల సమస్యలను తీర్చేందుకు కూడా రేవంత్‌రెడ్డి సర్కారు పూనుకుంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి గుడ్‌న్యూస్ వినిపించారు. మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులపైనా దృష్టి పెట్టాలని సూచించారు.
సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో విద్యాశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామంలో అయినా కూడా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలని చెప్పారు. బాలబాలికలు ఎవరూ చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండొద్దని చెప్పారు. విద్యార్థులు లేరనే నెపంతో ఇప్పటికే పలు పాఠశాలలు మూసివేసిన విషయాలు తన దృష్టికి వచ్చాయన్న సీఎం రేవంత్‌రెడ్డి.. పాఠశాలల్లో ఎంత మంది ఉన్నా కూడా వాటిని నడపాల్సిందే అని సూచించారు. ఇందు కోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీ నిర్వహణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే.. మన ఊరు-మన బడి కార్యక్రమంలో జరిగిన పనులపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఇప్పటివరకు ఆ కార్యక్రమంలో భాగంగా మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలని.. అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. మరోవైపు ఉపాధ్యాయులు ప్రమోషన్లు, బదిలీల్లో ఉన్న అవాంతరాలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. అన్ని పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుద్ధ్య కార్మికులను నియమించేందుకు ఉన్న మార్గాలను చూడాలని విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.