విద్యా విధానం, ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్‌ సంచలన కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యా విధానం, ఫోన్ ట్యాపింగ్ కేసు మరియు తాజా రాజకీయ పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు

By -  Knakam Karthik
Published on : 20 March 2026 6:40 PM IST

Telamgana, CM Revanthreddy, Telangana Education Policy, PhoneTappingCase, MusiRevitalisation

ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు..సీఎం రేవంత్ సంచలన ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యా విధానం, ఫోన్ ట్యాపింగ్ కేసు మరియు తాజా రాజకీయ పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణను వివరించారు.

తెలంగాణలో కొత్త విద్యా పాలసీ: ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు!

రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి సరికొత్త 'తెలంగాణ విద్యా పాలసీ'ని అమలు చేస్తామని, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని వెల్లడించారు. ముఖ్యంగా ఇకపై విద్యార్థులకు పదో తరగతి బోర్డు పరీక్షలు ఉండవని, విద్యా విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు క్లీన్ చిట్ రాలేదు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందిస్తూ, ఈ కేసులో అరెస్టులు కొనసాగుతాయని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుకు ఈ కేసులో క్లీన్ చిట్ లభించిందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. చక్రధర్ గౌడ్ కేసులో మాత్రమే ఆయనకు కోర్టులో ఊరట లభించిందని, సిట్ (SIT) విచారణలో ఎలాంటి రిలీఫ్ లేదని స్పష్టం చేశారు. ప్రభాకర్ రావు నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే స్టేట్‌మెంట్లు నమోదు చేస్తున్నామని, ప్రభుత్వం ఎవరిపై కక్ష సాధింపులకు పాల్పడదని వివరించారు.

మూసీ ప్రక్షాళన ఆగదు.. పునరుజ్జీవం చారిత్రక అవసరం

మూసీ నది ప్రక్షాళనపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నది ఎక్కడ ఉందో అక్కడే కాపాడుకోవాలని, వేరే చోట సృష్టించలేమని అన్నారు. ఈ ప్రక్రియలో ఇబ్బంది పడే నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ పాలనపై విమర్శలు.. గ్యారెంటీల అమలుపై ధీమా

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు తాము వడ్డీలు చెల్లిస్తున్నామని రేవంత్ మండిపడ్డారు. "వారు చేసిన తప్పులకు బాధ్యత వహించాలి, చెవిలో పూలు పెట్టుకుని తప్పించుకోలేరు" అని విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలుపై స్పందిస్తూ.. ఏ గ్యారెంటీ ఎప్పుడు అమలు చేయాలో తమకు తెలుసని, ఇందిరమ్మ కుటుంబ బీమా రేషన్ కార్డు దారులందరికీ వర్తిస్తుందని ప్రకటించారు.

Next Story