గోదావరి జలాలతో వికారాబాద్‌ను సస్యశ్యామలం చేస్తా: సీఎం రేవంత్
గోదావరి జలాల ద్వారా తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By - అంజి |
గోదావరి జలాలతో వికారాబాద్‌ను సస్యశ్యామలం చేస్తా: సీఎం రేవంత్
గోదావరి జలాల ద్వారా తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే మూడేళ్లలో మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. “ప్రజా పాలన- ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా నారాయణపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
లక్ష్మిదేవిపల్లిలో రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణతో పాటు పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలను చేపడుతామని వెల్లడించారు. తాండూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు కాగ్నా నుంచి మంచినీటిని అందించే కార్యక్రమాలను పూర్తి చేస్తామని చెప్పారు. సంవత్సరం తిరిగేలోపు అప్పా జంక్షన్ నుంచి మన్నె గూడ అక్కడి నుంచి తాండూరు వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
తెలంగాణ మణిహారంగా త్రిబుల్ ఆర్, అలాగే రేడియల్ రోడ్లను పూర్తి చేస్తామని, రాబోయే రోజుల్లో వికారాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారబోతోందన్నారు. అనేక సమస్యలను అధిగమిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ప్రజలంతా సహకరించాలని కోరారు. తెలంగాణలో ప్రధానంగా రైతాంగం, నిరుద్యోగ యువత, మహిళలు ప్రాధాన్యంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెబుతూ ముఖ్యమంత్రి గారు వాటిని వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లాలోని 6,650 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి కింద రూ. 567.69 కోట్ల చెక్కును మహిళా ప్రతినిధులకు అందజేశారు. ఈ బహిరంగ సభలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.