మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొనాలి: సీఎం రేవంత్
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో రెండ్రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది.
By Srikanth Gundamalla Published on 1 Sep 2024 7:15 AM GMTతెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో రెండ్రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. దాంతో.. రోడ్లపైకి వరద నీరు చేరుతోంది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లోని చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలోనే అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి పలు కీలక సూచనలు చేశారు.
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలన్నారు. ఎక్కడా ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయం అవసరమైన వారికి అందుబాటులో ఉండి.. తగిన విధంగా సాయం అందించాలని చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మున్సిపల్, నీటిపారుదల శఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సెలవులు పెట్టొద్దనీ చెప్పారు. ఇక ప్రజలు కూడా జాగ్రత్తలు వహించాలని, అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.