ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

భద్రాచలంలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు.

By Srikanth Gundamalla
Published on : 11 March 2024 3:46 PM IST

cm revanth reddy, indiramma house scheme,  telangana ,

 ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 

తెలంగాణ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. భద్రాచలంలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

భద్రాచలంలో శ్రీరాముడి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బుడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటుందని చెప్పారు. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల అని చెప్పుకొచ్చారు. వారి ఆత్మగౌరవంగా భావిస్తారని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో వారి ఆత్మగౌరవం కోసం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. మహిళల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇంట్లో ఇల్లాలి ముఖంపై చిరునవ్వు ఉంటే అంతా సవ్యంగా ఉంటాయని రేవంత్‌రెడ్డి అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తమ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్ ఇళ్లను అందజేస్తుందని చెప్పారు. డబుల్‌బెడ్రూం ఇళ్ల పేరుతో గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. పేదల కలల మీద ఓట్ల వ్యాపారం చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ పాలనలో ఇబ్బందులు పడ్డారనీ.. హామీలు తప్ప చేసిందేమీ లేదన్నారు. భారీ అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రజలపై భారం మోపారంటూ గత ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల బాధలను పోగొట్టేందుకే కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని చెప్పారు. ఇచ్చిన హామీలను 90 రోజుల్లో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. చెప్పినట్లుగానే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా పట్టాలు తామే ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

Next Story