'అర్హులందరికీ సంక్షేమ పథకాలు'.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికీ చేరడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల...
By - అంజి |
'అర్హులందరికీ సంక్షేమ పథకాలు'.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికీ చేరడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'పై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ముఖ్యంగా కింది స్థాయి నుంచి మార్పు రావాలని ఆయన సూచించారు. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై లబ్ధిదారుల అభిప్రాయాలను నేరుగా సేకరించాలని ఆదేశించారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
అలాగే రాష్ట్రంలో విద్యా, వైద్య వ్యవస్థలను బలోపేతం చేయడంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ ఆస్పత్రులను సమీపంలోని మెడికల్ కాలేజీలతో అనుసంధానించడం ద్వారా వైద్య సేవల్లో నాణ్యత పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకువస్తున్న మార్పుల గురించి సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాలి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు పెండింగ్‌లో లేకుండా ప్రతినెలా బిల్లులు చెల్లించాలని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా జాప్యం జరగకూడదని, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), ఇతర ఉన్నతాధికారులు పాల్గొని ప్రగతి నివేదికలను సమర్పించారు.